మంచు మనోజ్ హీరోగా తెరకెక్కుతున్న ‘డేవిడ్ రెడ్డి’ సినిమాలో రమ్యకృష్ణ పోషిస్తున్న ‘కమలా రెడ్డి’ పాత్రకు సంబంధించిన ఫస్ట్ లుక్ను మేకర్స్ విడుదల చేశారు. రమ్యకృష్ణ పుట్టినరోజు సందర్భంగా రిలీజ్ చేసిన ఈ పోస్టర్లో ఆమె ఎంతో పవర్ఫుల్, గంభీరమైన లుక్లో కనిపించారు. పాత్రలోని బలమైన వ్యక్తిత్వాన్ని ప్రతిబింబించేలా ఫస్ట్ లుక్ను డిజైన్ చేశారు.
హనుమా రెడ్డి యక్కంటి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం బ్రిటిష్ కాలం నేపథ్యంలో సాగే పీరియడ్ యాక్షన్ డ్రామా. మంచు మనోజ్ ప్రధాన పాత్రలో నటిస్తుండగా.. మరియా రియాబోషాప్కా హీరోయిన్గా కనిపించనున్నారు. తెలుగు, హిందీ, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో తెరకెక్కుతున్న ఈ సినిమాను భారీ స్థాయిలో రూపొందిస్తున్నారు.
తాజాగా విడుదలైన పోస్టర్లో కత్తి చేత పట్టుకుని యుద్ధానికి సిద్ధమైనట్టుగా కనిపిస్తున్న రమ్యకృష్ణ.. కమలా రెడ్డి పాత్రపై ఆసక్తిని పెంచారు. కథలో ఆమె పాత్రకు ఎలాంటి ప్రాధాన్యత ఉంది? మంచు మనోజ్ పాత్రతో ఆమెకు ఎలాంటి సంబంధం ఉంటుంది? అనే విషయాలు ప్రస్తుతం ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. ఈ సినిమాతో రమ్యకృష్ణ మరోసారి బలమైన పాత్రలో కనిపించనున్నారని మేకర్స్ చెబుతున్నారు.