రాజకీయ భావోద్వేగ కథతో ప్రేక్షకుల ముందుకు రానున్న చిత్రం
పాలిటికల్ ఎమోషనల్ ఎంటర్‌టైనర్ 'ధర్మస్థల నియోజకవర్గం' సెన్సార్ కార్యక్రమాలను విజయవంతంగా పూర్తి చేసుకుని U/A 16+ సర్టిఫికెట్ పొందింది. దీంతో సినిమా విడుదలకు మార్గం సుగమమైంది. విడుదల తేదీని త్వరలోనే అధికారికంగా ప్రకటించే అవకాశం ఉందని చిత్ర వర్గాలు వెల్లడిస్తున్నాయి.
జై జ్ఞాన ప్రభ తోట దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం రాజకీయాలు, భావోద్వేగాలు, యాక్షన్, కుటుంబ అనుబంధాలను మేళవించిన విభిన్న కథాంశంతో తెరకెక్కింది. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్, ప్రచార సామగ్రి ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచాయి.
ఈ చిత్రంలో సీనియర్ నటులు సుమన్, సాయికుమార్ ప్రధాన పాత్రలు పోషిస్తుండగా, వరుణ్ సందేశ్, వితికా షేరు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. అలాగే రాజా రవీంద్ర, రాజీవ్ కనకాల, కాలకేయ ప్రభాకర్, పృథ్వి రాజ్ తదితరులు నటిస్తున్నారు.
ఈ చిత్రాన్ని మెరుం భాస్కర్ మూవింగ్ డ్రీమ్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు. పాటలకు చంద్రబోస్ సాహిత్యం అందించగా, ప్రముఖ గాయని సునీత ఉపద్రష్ట తన స్వరాన్ని అందించారు. సినిమాటోగ్రఫీని వెంకట హనుమ, ఎడిటింగ్‌ను సాయిబాబు తలారి, యాక్షన్‌ను నందు మాస్టర్ నిర్వహించారు.
సెన్సార్ పూర్తి కావడంతో 'ధర్మస్థల నియోజకవర్గం'పై ప్రేక్షకుల్లో ఆసక్తి మరింత పెరిగింది. రాజకీయ నేపథ్యంతో పాటు బలమైన భావోద్వేగాలు, ఉత్కంఠభరితమైన కథనం ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయని చిత్రబృందం ధీమా వ్యక్తం చేస్తోంది.
