అల్లరి నరేష్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న ఫాంటసీ కామెడీ ఎంటర్టైనర్ ‘రంభ ఊర్వశి మేనక’ నుంచి మరో పాట ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తాజాగా ‘బ్యాడ్ టైం బ్యాండ్ బాజా’ అనే ప్రమోషనల్ సాంగ్‌ను మేకర్స్ విడుదల చేశారు. రామ్ మిరియాల ఆలపించిన ఈ పాటకు చైతన్ భరద్వాజ్ సంగీతం అందించగా, భాస్కరభట్ల సాహిత్యం అందించారు. పాటలో అల్లరి నరేష్ పాత్ర ఎదుర్కొంటున్న పరిస్థితులను సరదాగా చూపించే ప్రయత్నం కనిపిస్తోంది.
చంద్ర మోహన్ చింతడ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా అల్లరి నరేష్‌ను మరోసారి తన కామెడీ జోన్లోకి తీసుకురానుంది. సురభి కథానాయికగా నటిస్తుండగా, రాశి సింగ్, విష్ణుప్రియ, ప్రిషా సింగ్ రంభ, ఊర్వశి, మేనక పాత్రల్లో కనిపించనున్నారు. వెంకటేశ్ కిషోర్, నరేష్ వీకే, శ్రీనివాస్ రెడ్డి, మురళీధర్ గౌడ్ తదితరులు కీలక పాత్రల్లో భాగమయ్యారు. ఫాంటసీ అంశాలకు కామెడీని జోడిస్తూ తెరకెక్కుతున్న ఈ చిత్రం ఇప్పటికే టీజర్‌తో ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచింది.
అన్నపూర్ణ స్టూడియోస్, హాస్య మూవీస్ బ్యానర్లపై రాజేష్ దండా, నిమ్మకాయల ప్రసాద్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం అల్లరి నరేష్ కెరీర్లో 65వ సినిమాగా వస్తోంది. చైతన్ భరద్వాజ్ సంగీతం, రామ్ రెడ్డి సినిమాటోగ్రఫీ, బ్రహ్మ కడలి ప్రొడక్షన్ డిజైన్, చోటా కే ప్రసాద్ ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన పాటలు, టీజర్‌కు కొనసాగింపుగా ‘బ్యాడ్ టైం బ్యాండ్ బాజా’ కూడా సినిమాపై మరింత బజ్ తీసుకొస్తుందని చిత్రబృందం ఆశిస్తోంది. ఈ సినిమా సెప్టెంబర్ 4, 2026న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది.