తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ట్రస్టులు, పథకాలకు విరాళాలు అందించే భక్తుల కోసం కొత్త నిబంధనలను ప్రకటించింది. టీటీడీ బోర్డు సమావేశంలో ఈ నిర్ణయానికి ఆమోదం లభించగా, జూలై 14 అర్ధరాత్రి నుంచి కొత్తగా విరాళాలు ఇచ్చే దాతలకు ఈ నిబంధనలు అమల్లోకి వచ్చాయి. ఇప్పటికే విరాళాలు ఇచ్చిన దాతలకు పాత సౌకర్యాలే కొనసాగుతాయి.
టీటీడీ ప్రకారం, దాతలకు ఇచ్చే ప్రివిలేజీలను ఒకే విధంగా అమలు చేయడం, పారదర్శకత పెంచడం, అలాగే సాధారణ భక్తులకు ఎక్కువ దర్శన అవకాశాలు కల్పించడమే ఈ మార్పుల ప్రధాన ఉద్దేశం.
కొత్త డోనర్ రూల్స్ ఇవే
- రూ.1 లక్ష నుంచి రూ.5 లక్షల వరకు విరాళం ఇచ్చే దాతలకు స్పెషల్ ఎంట్రీ దర్శనం (₹300 టికెట్) మాత్రమే ఉంటుంది.
- ఈ కేటగిరీకి గతంలో ఉన్న సుపథం దర్శనం సౌకర్యాన్ని తొలగించారు.
- రూ.5 లక్షలు, రూ.10 లక్షలు, రూ.25 లక్షలు, రూ.50 లక్షలు, రూ.75 లక్షలు, రూ.1 కోటి వరకు కొత్త కేటగిరీలను రూపొందించి, వాటికి వేర్వేరు ప్రివిలేజీలను నిర్ణయించారు.
- విరాళం మొత్తం పెరిగే కొద్దీ సుపథం దర్శనం, బ్రేక్ దర్శనం, సుప్రభాత సేవ, వీఐపీ వసతి వంటి సౌకర్యాలు దశలవారీగా లభిస్తాయి.
- లడ్డూలు, మహాప్రసాదం, బహుమతులు, వసతి రోజుల సంఖ్య కూడా డొనేషన్ స్లాబ్‌ను బట్టి మారుతుంది.
- రూ.1 కోటి, అంతకంటే ఎక్కువ విరాళం ఇచ్చే దాతలకు ఇప్పటివరకు ఉన్న ప్రత్యేక ప్రివిలేజీలు కొనసాగుతాయి.
టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు మాట్లాడుతూ, కొత్త విధానం వల్ల దాతలకు సముచిత గౌరవం కొనసాగుతూనే, సామాన్య భక్తులకు కూడా దర్శన అవకాశాలు మరింత మెరుగుపడతాయని తెలిపారు.