‘418’.. థియేటర్లలో భయపెట్టేందుకు రెడీ!

11 Sep 2026
‘418’.. థియేటర్లలో భయపెట్టేందుకు రెడీ!

హారర్ సినిమాలను చూస్తూ నవ్వుకోవడం కాదు.. ఈసారి నిజంగా భయపడేలా చేస్తామంటోంది ‘418’ టీమ్. సెప్టెంబర్ 18, 2026న ఈ సినిమా థియేటర్లలోకి రాబోతోంది. ప్రముఖ దర్శకుడు ప్రశాంత్ నీల్ సమర్పణలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి కీర్తన్ నాగగౌడ దర్శకత్వం వహించారు. కామెడీకి దూరంగా సీరియస్ హారర్, మిస్టరీ అంశాలతో ప్రేక్షకులను థ్రిల్ చేయడమే లక్ష్యంగా సినిమా రూపొందినట్లు తెలుస్తోంది.

ఒక మిస్టీరియస్ బిల్డింగ్, అందులోని 418వ గది చుట్టూ దాగి ఉన్న రహస్యాలే కథకు ప్రధాన బలం కానున్నట్లు ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది. ఏళ్లుగా మూసి ఉన్న ఆ ప్రదేశంలో చోటుచేసుకునే అనూహ్య పరిణామాలు కథలో ఉత్కంఠను పెంచనున్నాయి. సూర్య రాజ్, చరణ్ లక్ష్మి, ప్రీతి పగడాల కీలక పాత్రల్లో నటించగా.. భయానక వాతావరణం, సస్పెన్స్‌కు మేకర్స్ ప్రాధాన్యత ఇచ్చారు.

మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్ నిర్మించిన ఈ సినిమాకు ఇప్పటికే హారర్ మూవీ లవర్స్‌లో ఆసక్తి మొదలైంది. ఈ చిత్రానికి ‘A’ సర్టిఫికెట్ లభించడం కూడా ఇందులోని హారర్ కంటెంట్ ఎంత ఇంటెన్స్‌గా ఉండబోతుందో సూచిస్తోంది. సెప్టెంబర్ 18న థియేటర్లలోకి వస్తున్న ‘418’.. ప్రేక్షకులను నిజంగానే భయపెట్టగలదా అనేది చూడాలి.

👍 Like & Share This Article
0 Likes

+