సినిమా అనేది కేవలం రెండు మూడు గంటల వినోదం కాదు.. అది ఎన్నో జ్ఞాపకాలను, అనుభూతులను, భావోద్వేగాలను మోసుకొచ్చే ఒక గొప్ప అనుభవం. దాదాపు 90 ఏళ్ల భారతీయ సినిమా ప్రయాణంలో థియేటర్ అనేది ప్రతి కుటుంబ జీవితంలో ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది.
ఒకప్పుడు సినిమా చూడటం అంటే ఒక పండుగలా ఉండేది. కొత్త సినిమా విడుదలైతే చాలు.. గ్రామాల్లో, పట్టణాల్లో సందడి మొదలయ్యేది. కుటుంబ సభ్యులంతా కలిసి సినిమా వెళ్లడానికి సిద్ధమయ్యేవారు. కొందరు కిలోమీటర్ల దూరం కాలినడకన నడుచుకుంటూ థియేటర్లకు వెళ్లేవారు. మరికొందరు ఎడ్ల బండ్లపై ప్రయాణం చేసి తమ అభిమాన హీరో సినిమాను చూసేవారు. ఇంకొందరు సైకిళ్లపై, బస్సుల్లో, వివిధ రకాల ప్రయాణ మార్గాల్లో థియేటర్ చేరుకుని వెండితెరపై కనిపించే అద్భుతాన్ని ఆస్వాదించేవారు.
ఆ రోజుల్లో థియేటర్ అంటే కేవలం సినిమా హాల్ కాదు.. అది ఒక కలల ప్రపంచం. తెరపై హీరో ఎంట్రీ ఇస్తే ప్రేక్షకుల కేరింతలు, పాటలు వస్తే చప్పట్లు, క్లైమాక్స్ సమయంలో ఉత్కంఠ.. ఇవన్నీ కలిపి ఒక మరచిపోలేని అనుభూతిని ఇచ్చేవి. ఒకే కుటుంబానికి చెందిన మూడు తరాలు కూడా కలిసి థియేటర్‌కు వెళ్లి సినిమాలను ఆస్వాదించిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి.
అప్పట్లో సినిమా అనేది కుటుంబాలను కలిపే ఒక కారణంగా ఉండేది. పండుగలకు, సెలవులకు, ప్రత్యేక సందర్భాలకు కుటుంబంతో కలిసి సినిమా చూడటం ఒక సంప్రదాయంగా మారింది. థియేటర్‌లో కూర్చుని తెలియని వ్యక్తులతో కూడా కలిసి నవ్వడం, ఏడవడం, ఆనందాన్ని పంచుకోవడం అనేది కేవలం అక్కడే దొరికే అనుభూతి.
కానీ కాలం మారింది. సాంకేతికత పెరిగింది. ఓటీటీలు, ఇంటి వద్దే అందుబాటులోకి వచ్చిన వినోద సౌకర్యాల కారణంగా ప్రేక్షకులు థియేటర్లకు రావడం క్రమంగా తగ్గుతోంది. ఇంట్లోనే సినిమా చూసే అవకాశం ఉన్నప్పటికీ.. పెద్ద తెరపై కనిపించే ఆ వైభవం, థియేటర్ సౌండ్ అనుభూతి, వందల మంది ప్రేక్షకులతో కలిసి సినిమా చూసే ఉత్సాహం మాత్రం ప్రత్యేకమైనదే.
ముఖ్యంగా భారీ బడ్జెట్ సినిమాలు, అద్భుతమైన విజువల్స్, యాక్షన్ సన్నివేశాలు, గ్రాండ్ ఎలివేషన్స్ ఉన్న చిత్రాలు థియేటర్‌లో చూస్తేనే అసలు అనుభూతి తెలుస్తుంది. చిన్న స్క్రీన్‌లో చూసే దానికంటే వందల అడుగుల పెద్ద తెరపై సినిమా చూసే మజానే వేరు.
అందుకే ప్రేక్షక దేవుళ్లకు ఒక చిన్న విజ్ఞప్తి.. మంచి సినిమాలను ప్రోత్సహించండి. కుటుంబ సభ్యులతో కలిసి థియేటర్‌కు వెళ్లండి. పిల్లలకు కూడా పెద్ద తెరపై సినిమా చూసే అనుభవాన్ని అందించండి. ఎందుకంటే థియేటర్ అనేది కేవలం సినిమా చూసే ప్రదేశం కాదు.. అది మన జ్ఞాపకాల్లో ఎప్పటికీ నిలిచిపోయే ఒక అందమైన అనుభవం.
ఒకప్పుడు మన పెద్దలు ఎన్ని కష్టాలు పడి అయినా సినిమా కోసం థియేటర్‌కు వెళ్లారు. ఎడ్ల బండ్లపై, సైకిళ్లపై, నడుచుకుంటూ వెళ్లి సినిమాను పండుగలా జరుపుకున్నారు. ఇప్పుడు మనకు అన్ని సౌకర్యాలు ఉన్న సమయంలో, కుటుంబంతో కలిసి ఒకసారి థియేటర్‌కు వెళ్లి ఆ మ్యాజిక్‌ను మళ్లీ ఆస్వాదిద్దాం.
సినిమా బతకాలంటే థియేటర్ బతకాలి.. థియేటర్ బతకాలంటే ప్రేక్షకుల ఆదరణ అవసరం.
