మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ యాక్షన్ ఎంటర్టైనర్ ‘కాకా’ మరో కీలక దశలోకి అడుగుపెట్టింది. దర్శకుడు బాబీ కొల్లి సంప్రదాయ పూజా కార్యక్రమంతో సినిమా డబ్బింగ్ పనులను ప్రారంభించారు. ఒకవైపు మిగిలిన షూటింగ్ జరుగుతుండగా, మరోవైపు పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా కొనసాగుతున్నాయి.
చిరంజీవి, బాబీ కాంబినేషన్లో వస్తున్న ఈ సినిమా వాల్తేరు వీరయ్య తర్వాత వీరిద్దరి రెండో చిత్రం. ఇప్పటికే విడుదలైన టైటిల్ గ్లింప్స్‌లో చిరంజీవి పాత్రకు సంబంధించిన ఆసక్తికరమైన అంశాలను చూపించడంతో సినిమాపై క్యూరియాసిటీ పెరిగింది. అనస్వర రాజన్, నివేదా పేతురాజ్, సునీల్, గెటప్ శ్రీను, రాచిత రామ్ కీలక పాత్రల్లో నటిస్తుండగా.. థమన్ సంగీతం అందిస్తున్నారు.
డబ్బింగ్ పనులు ప్రారంభం కావడంతో ‘కాకా’ నిర్మాణం తుది దశల వైపు వేగంగా కదులుతోంది. ఈ సినిమాను జనవరి 13, 2027న సంక్రాంతి కానుకగా ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నట్లు కేవీఎన్ ప్రొడక్షన్స్ ఇప్పటికే ప్రకటించింది. మిగిలిన షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్ పనులను కూడా సమాంతరంగా పూర్తి చేస్తూ.. త్వరలో ఫస్ట్ సింగిల్‌ను విడుదల చేసేందుకు మేకర్స్ సిద్ధమవుతున్నారు.