‘హనుమాన్ అంష్’ తెలుగులోకి.. తులసీదాస్‌పై దర్శకుడి నెక్ట్స్ మూవీ!

15 Sep 2026
‘హనుమాన్ అంష్’ తెలుగులోకి.. తులసీదాస్‌పై దర్శకుడి నెక్ట్స్ మూవీ!

చిన్న బడ్జెట్‌తో తెరకెక్కిన ‘హనుమాన్ అంష్’ ఊహించని స్థాయిలో బాక్సాఫీస్ విజయాన్ని అందుకుంటోంది. నీమ్ కరోలి బాబా జీవితం, బోధనల ఆధారంగా రూపొందిన ఈ భక్తిరస ప్రధాన చిత్రం.. మౌత్ టాక్‌తో క్రమంగా పుంజుకుని ప్రపంచవ్యాప్తంగా రూ.250 కోట్ల మార్క్‌ను దాటింది. ఇదే జోరు కొనసాగితే త్వరలోనే రూ.300 కోట్ల క్లబ్‌లోకి అడుగుపెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి.

హిందీ ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ చిత్రం ఇప్పుడు తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. సెప్టెంబర్ 18న ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ‘హనుమాన్ అంష్’ విడుదల కానుంది. తెలుగు వెర్షన్‌ను దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ప్రెజెంట్ చేయనుండటంతో ఈ సినిమాపై టాలీవుడ్‌లోనూ ఆసక్తి పెరుగుతోంది. ఇప్పటికే బాక్సాఫీస్ వద్ద సాధించిన సంచలన విజయం తెలుగు రిలీజ్‌పై అంచనాలను పెంచుతోంది.

ఇదిలా ఉంటే.. ‘హనుమాన్ అంష్’ దర్శకుడు విశాల్ చతుర్వేది తన తదుపరి సినిమాను కూడా ప్రకటించారు. ‘రాంబోలా’ పేరుతో తెరకెక్కనున్న ఈ చిత్రం మహాకవి, భక్తకవి గోస్వామి తులసీదాస్ జీవితం, ఆధ్యాత్మిక ప్రయాణం చుట్టూ సాగనుంది. ఈ సినిమాకు కథ, దర్శకత్వ బాధ్యతలను విశాల్ చతుర్వేదే నిర్వహించనున్నారు. ‘హనుమాన్ అంష్’ విజయంతో ఈ కొత్త ప్రాజెక్ట్‌పై కూడా ఆసక్తి నెలకొంది.

👍 Like & Share This Article
0 Likes

+