సంగీత దర్శకుడిగా, నటుడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న జి.వి. ప్రకాశ్ కుమార్ నటించిన ‘ఇమ్మోర్టల్’ ఇప్పుడు తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. మారియప్పన్ చిన్నా దర్శకత్వం వహించిన ఈ ఫాంటసీ థ్రిల్లర్‌లో జి.వి. ప్రకాశ్ కుమార్, కయాదు లోహర్ జంటగా నటించారు. ప్రేమ, మిస్టరీ, సూపర్‌నేచురల్ అంశాల కలయికతో ఈ సినిమా తెరకెక్కింది.
తమిళ వెర్షన్ సెప్టెంబర్ 4న థియేటర్లలో విడుదల కాగా.. భిన్నమైన కథాంశంతో ఈ సినిమా ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించింది. ఇప్పుడు సెప్టెంబర్ 19న ‘ఇమ్మోర్టల్’ పేరుతో తెలుగు వెర్షన్ ప్రేక్షకుల ముందుకు రానుంది. సినిమాలోని మిస్టరీ, ఫాంటసీ అంశాలు తెలుగు ప్రేక్షకులకు కొత్త అనుభూతిని అందించేలా ఉన్నాయని చిత్ర బృందం భావిస్తోంది.
హీరోగా జి.వి. ప్రకాశ్ కుమార్, దర్శకుడిగా మారియప్పన్ చిన్నా చేస్తున్న ఈ ప్రయత్నంపై తెలుగు ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. ప్రేమకథకు హారర్, ఫాంటసీ టచ్‌ను జోడించిన ఈ చిత్రం.. సాధారణ కథలకు భిన్నంగా ఉండటంతో థియేటర్లలో ఎలాంటి స్పందన అందుకుంటుందో చూడాలి.