మాస్ మహారాజా రవితేజ కథానాయకుడిగా, శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కిన ‘ఇరుముడి’ విడుదలకు సిద్ధమైంది. కుటుంబ భావోద్వేగాలు, గ్రామీణ నేపథ్యం, థ్రిల్లింగ్ అంశాలను మేళవించిన ఈ చిత్రంపై ఇప్పటికే మంచి ఆసక్తి నెలకొంది. ప్రియా భవానీ శంకర్ కథానాయికగా నటించగా, సాయికుమార్, అజయ్ ఘోష్, స్వాసిక తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మించింది.
తాజాగా ‘ఇరుముడి’ సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుని U/A సర్టిఫికెట్ అందుకుంది. చిత్ర నిడివిని 2 గంటల 25 నిమిషాలుగా, అంటే 145 నిమిషాలుగా లాక్ చేసినట్లు తాజా సమాచారం. కథలోని ఎమోషనల్ సన్నివేశాలు, సస్పెన్స్ అంశాలను ఎక్కువ సాగదీయకుండా ప్రేక్షకులకు అందించేలా ఈ రన్టైమ్ ఉండనుందని తెలుస్తోంది.
తండ్రీ–కూతుళ్ల అనుబంధాన్ని ప్రధానంగా తీసుకుని సాగే కథలో రవితేజ పాత్రలో భావోద్వేగంతో పాటు మరో కోణాన్ని కూడా దర్శకుడు శివ నిర్వాణ చూపించనున్నట్లు ప్రచార చిత్రాలు సూచిస్తున్నాయి. ట్రైలర్లో కనిపించిన సస్పెన్స్, గ్రామీణ వాతావరణం, అయ్యప్ప దీక్షకు సంబంధించిన అంశాలు సినిమాపై అంచనాలను పెంచాయి. ఆగస్టు 21న థియేటర్లలోకి రానున్న ‘ఇరుముడి’తో రవితేజ మరో విజయాన్ని అందుకుంటారా అనేది ఆసక్తికరంగా మారింది.