పాన్ ఇండియా స్థాయిలో సంచలనం సృష్టించిన ‘కల్కి 2898 ఏడీ’ మరో ప్రతిష్టాత్మక ఘనతను సొంతం చేసుకుంది. ఈ సినిమా రెండు జాతీయ అవార్డులను అందుకుంది. ఉత్తమ ప్రజాదరణ పొందిన వినోదాత్మక చిత్రం మరియు ఉత్తమ స్పెషల్ ఎఫెక్ట్స్ విభాగాల్లో అవార్డులు రావడంతో వైజయంతీ మూవీస్ టీమ్‌లో సంబరాలు మొదలయ్యాయి.
నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వైజయంతీ మూవీస్ నిర్మించిన ఈ సినిమా.. ఫ్యూచరిస్టిక్ ప్రపంచాన్ని భారతీయ పురాణ అంశాలతో మిళితం చేస్తూ తెరకెక్కింది. భారీ సెట్స్, విజువల్ డిజైన్, స్పెషల్ ఎఫెక్ట్స్, వరల్డ్ బిల్డింగ్ సినిమాకు ప్రత్యేక గుర్తింపును తీసుకొచ్చాయి. ముఖ్యంగా ప్రేక్షకులను కొత్త ప్రపంచంలోకి తీసుకెళ్లేలా రూపొందించిన విజువల్ ట్రీట్‌కు ఈ అవార్డు మరో గుర్తింపుగా నిలిచింది.
ఇక రెండు విభాగాల్లో జాతీయ అవార్డులు దక్కించుకోవడంతో వైజయంతీ మూవీస్ టీమ్ ఆనందం వ్యక్తం చేస్తోంది. సినిమా అందించిన వినోదంతో పాటు టెక్నికల్‌గా చూపించిన ప్రతిభకు కూడా ఈ గౌరవం దక్కడం విశేషంగా మారింది. ఇప్పటికే పాన్ ఇండియా స్థాయిలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ‘కల్కి 2898 ఏడీ’ ఖాతాలో ఈ రెండు నేషనల్ అవార్డులు మరో మైలురాయిగా నిలిచాయి.