నటుడు, దర్శకుడు, కొరియోగ్రాఫర్ రాఘవ లారెన్స్ రాజకీయాల్లోకి అడుగుపెడుతున్నట్లు ప్రకటించారు. శుక్రవారం ఉదయం ఈ విషయాన్ని అధికారికంగా వెల్లడించిన ఆయన, త్వరలోనే తన రాజకీయ భవిష్యత్ కార్యాచరణను ప్రజలకు తెలియజేస్తానని చెప్పారు.
ఇటీవల తమిళనాడులోని తిరుచ్చి ఈస్ట్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఆయన పోటీ చేసే అవకాశముందనే వార్తలు ప్రచారంలోకి వచ్చాయి. ఈ నేపథ్యంలో లారెన్స్ చేసిన ప్రకటన రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
సోషల్ మీడియా వేదిక ఎక్స్ (ట్విటర్)లో ఓ సుదీర్ఘ పోస్టు చేసిన లారెన్స్, రాజకీయాల్లోకి రావడానికి గల కారణాలను వివరించారు.
"నేను ఎప్పుడూ రాజకీయాల్లోకి వస్తానని ఊహించలేదు. డబ్బు సంపాదించాలన్నా, పదవి పొందాలన్నా నాకు ఎలాంటి ఆసక్తి లేదు. నాకు నమ్మకమైన, సన్నిహితమైన వ్యక్తి రాజకీయాల్లోకి వస్తే, అతనికి అండగా నిలబడి సమాజానికి మరింత పెద్ద స్థాయిలో సేవ చేయాలనేదే నా ఆలోచన" అని లారెన్స్ పేర్కొన్నారు.
అలాగే, "ప్రస్తుతం పరిస్థితులు నన్ను రాజకీయాల్లోకి అడుగుపెట్టాల్సిన స్థితికి తీసుకొచ్చాయి" అని ఆయన వెల్లడించారు.
తన రాజకీయ ప్రణాళికలపై తుది నిర్ణయం తీసుకునే ముందు ప్రజల అభిప్రాయాలను తెలుసుకోవాలనుకుంటున్నట్లు లారెన్స్ చెప్పారు. ప్రజల నుంచి వచ్చే స్పందన ఆధారంగా తన తదుపరి కార్యాచరణను ప్రకటిస్తానని స్పష్టం చేశారు.
రాఘవ లారెన్స్ రాజకీయ ప్రవేశం తమిళనాడు రాజకీయాల్లో ఎలాంటి ప్రభావం చూపుతుందో చూడాల్సి ఉంది. ఆయన అభిమానులు, సినీ వర్గాలు ఈ నిర్ణయంపై ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి.
