విజయ్ దేవరకొండ ప్రధాన పాత్రలో నటిస్తున్న పీరియడ్ యాక్షన్ డ్రామా ‘రనబలి’ ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతోంది. రాహుల్ సాంకృత్యాన్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను అక్టోబర్ 16, 2026న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల చేయనున్నారు. రష్మిక మందన్న విజయ్ సరసన జయమ్మ పాత్రలో కనిపించనుండగా, నవీన్ యెర్నేని, వై. రవిశంకర్ మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
19వ శతాబ్దపు దక్షిణ భారత నేపథ్యాన్ని ఆధారంగా చేసుకున్న ‘రనబలి’లో 1854 నుంచి 1878 మధ్య బ్రిటిష్ పాలన సమయంలో చోటుచేసుకున్న వాస్తవ చారిత్రక ఘటనల స్ఫూర్తి కనిపించనుంది. అప్పటి కాలంలోని పరిస్థితులు, ప్రజల పోరాటం, బ్రిటిష్ పాలన ప్రభావం వంటి అంశాలను దర్శకుడు రాహుల్ సాంకృత్యాన్ తనదైన శైలిలో తెరపై ఆవిష్కరిస్తున్నారు. కథలో విజయ్ పాత్ర ప్రయాణంలో జయమ్మ పాత్ర కూడా కీలకంగా ఉండనుంది.
ఈ సినిమాలో హాలీవుడ్ నటుడు ఆర్నాల్డ్ వోస్లూ కీలక పాత్రలో కనిపించనున్నారు. ఆయన సర్ థియోడర్ హెక్టర్ అనే బ్రిటిష్ అధికారి పాత్రను పోషిస్తున్నారు. భారీ స్థాయిలో రూపొందుతున్న ఈ పాన్ ఇండియా చిత్రం తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల కానుంది. ఇప్పటికే టీజర్ ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించగా, అక్టోబర్ 16న దసరా సందర్భంగా ‘రనబలి’ థియేటర్లలో సందడి చేయనుంది.