మహిళల ఆసియా కప్‌లో పాకిస్థాన్‌పై భారత మహిళల జట్టు అదిరిపోయే ప్రదర్శన చేసింది. తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ భారత బౌలింగ్‌ను ఎదుర్కోలేక 18.1 ఓవర్లలో కేవలం 55 పరుగులకే ఆలౌట్ అయింది. అనంతరం భారత్ కేవలం 8.4 ఓవర్లలోనే మూడు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించి ఏడు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది.
భారత్ విజయానికి ప్రధాన కారణం స్పిన్ బౌలింగ్. శ్రీ చరణి, ప్రేమా రావత్ చెరో మూడు వికెట్లు తీసి పాక్ బ్యాటింగ్‌ను కుప్పకూల్చగా, దీప్తి శర్మ రెండు వికెట్లతో తన వంతు పాత్ర పోషించారు. ముఖ్యంగా శ్రీ చరణి కేవలం 7 పరుగులు ఇచ్చి మూడు వికెట్లు పడగొట్టి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచారు.
చిన్న లక్ష్యం కావడంతో భారత జట్టుకు ఛేదన పెద్దగా కష్టంగా మారలేదు. కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ 18 పరుగులతో నాటౌట్‌గా నిలిచి జట్టును విజయతీరాలకు చేర్చారు. ఈ విజయంతో భారత్ టోర్నీలో తన జైత్రయాత్రను కొనసాగించడమే కాకుండా గ్రూప్-ఏలో అగ్రస్థానాన్ని మరింత బలపర్చుకుంది.