‘వన్ నేషన్.. వన్ ఎలక్షన్’ ప్రతిపాదనపై కేంద్రంలోని ఎన్డీఏ కూటమి మరింత వేగంగా ముందుకు వెళ్లే అవకాశాలపై చర్చ జరుగుతున్నట్లు సమాచారం. 2029 లోక్‌సభ ఎన్నికలతో పాటు 22 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో అసెంబ్లీ ఎన్నికలను ఒకేసారి నిర్వహించే లక్ష్యంతో ఎన్నికల సంస్కరణల ప్రణాళికను ముందుకు తీసుకెళ్లే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది.
ఒకేసారి ఎన్నికలు నిర్వహించాలనే ప్రతిపాదనకు ప్రధాన ఉద్దేశం ఎన్నికల ప్రక్రియ కోసం తరచూ అమలులోకి వచ్చే ప్రవర్తనా నియమావళి కారణంగా ప్రభుత్వ కార్యకలాపాలకు ఏర్పడే అంతరాయాలను తగ్గించడం. అలాగే ఎన్నికల నిర్వహణకు అయ్యే వ్యయం, భద్రతా ఏర్పాట్లు, సిబ్బంది వినియోగం వంటి అంశాల్లో కూడా సమర్థత పెరుగుతుందని ప్రతిపాదనకు మద్దతు ఇచ్చేవారు వాదిస్తున్నారు.
అయితే ఈ విధానాన్ని అమలు చేయాలంటే రాజ్యాంగ, చట్టపరమైన అంశాలతో పాటు రాష్ట్రాల రాజకీయ పరిస్థితులను కూడా పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది. వివిధ రాష్ట్రాల అసెంబ్లీల పదవీకాలాలను ఒకే ఎన్నికల చక్రంలోకి తీసుకురావడం ప్రధాన సవాలుగా మారే అవకాశం ఉంది. 2029 లక్ష్యంగా ఈ ప్రతిపాదనపై ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారనేది రాబోయే రోజుల్లో కీలకంగా మారనుంది.