ఒకప్పుడు భారతదేశంలోని గ్రామాలు, పట్టణాల్లో పిల్లలు ఎంతో ఉత్సాహంగా ఆడిన గిల్లీ డండా ఆట ఇప్పుడు స్పెయిన్‌లో వైరల్‌గా మారింది. స్పెయిన్‌లోని గలీషియా ప్రాంతంలో ఆడే సంప్రదాయ ఆట బిల్లార్డా వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా, అవి భారతీయ గిల్లీ డండాతో దాదాపు ఒకేలా ఉండటంతో భారతీయులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
వీడియోల్లో కనిపిస్తున్నట్లుగా చిన్న కర్రను గాల్లోకి ఎగరేసి పెద్ద కర్రతో దూరంగా కొట్టే విధానం మన దేశంలో ఆడే గిల్లీ డండా ఆటను అచ్చం గుర్తు చేస్తోంది. దీంతో నెటిజన్లు "ఇది మన చిన్నప్పటి ఆటే కదా" అంటూ కామెంట్లు చేస్తున్నారు.
భారతదేశంలో గిల్లీ డండాకు రెండు వేల సంవత్సరాలకు పైగా చరిత్ర ఉందని భావిస్తారు. మరోవైపు స్పెయిన్‌లో బిల్లార్డా మధ్యయుగ కాలం నుంచి కొనసాగుతున్న సంప్రదాయ ఆటగా గుర్తింపు పొందింది. ముఖ్యంగా అక్కడ ఈ ఆటకు ప్రత్యేక లీగ్‌లు, టోర్నమెంట్‌లు, అధికారిక సంఘాలు ఉండటం విశేషం.
ఈ వీడియోలు వైరల్ కావడంతో భారతీయ సంప్రదాయ ఆటలను కూడా ఇలాగే ప్రోత్సహించాలని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఒకప్పుడు ప్రతి వీధిలో కనిపించిన గిల్లీ డండా ఇప్పుడు కనుమరుగవుతుండగా, స్పెయిన్‌లో అదే తరహా ఆటకు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు లభిస్తుండటం అందరినీ ఆలోచింపజేస్తోంది.
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియోలు మరోసారి భారతీయ సంప్రదాయ ఆటల గొప్పతనాన్ని ప్రపంచానికి గుర్తు చేస్తున్నాయి.
